కంటోన్మెంట్, ఫిబ్రవరి 19 : దివంగత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం కార్ఖానాలోని గృహలక్ష్మి కాలనీలో నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితతో పాటు కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జనం మెచ్చిన నాయకుడిని.. స్మరించుకునేందుకు అభిమానులు తరలివచ్చారు.
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత భద్రారెడ్డి, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, అనితా ప్రభాకర్, పాండు యాదవ్, లోకనాథంతో పాటు నేతలు టీఎన్ శ్రీనివాస్, మురళీయాదవ్, పనస సంతోష్ హాజమరై సాయన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అలాగే రెండో వార్డులోని సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద బీఆర్ఎస్ నేతలు నరేశ్, బాలరాజ్, అంజనేయులు ఆధ్వర్యంలో చీరల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పలు వార్డుల బీఆర్ఎస్ ప్రెసిడెంట్లు, పలువురు సీనియర్, యువ, మహిళా నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.