వెంగళరావునగర్, అక్టోబర్ 29 : కాంగ్రెసోళ్లు పంచే డబ్బులు తీసుకుంటా.. కానీ ఓటు మాత్రం కారుకే వేస్తానని ఓ అవ్వ భరోసా ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా వెంగళరావునగర్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అక్కడ ఓ ఇంట్లో అవ్వతో ఆయన ముచ్చటించారు.
గడిచిన 22 నెలల కాంగ్రెస్ పాలనలో రూ.44 వేలు నీకు బాకీ ఉందని..బాకీ డబ్బు ఇచ్చేయాలని కాంగ్రెస్ వారిని నిలదీయాలని ఆయన ఆ అవ్వను కోరారు. కాంగ్రెస్ ఓటుకు రూ.4 వేలు ఇస్తే.. మిగిలిన బాకీ గురించి అడగాలని ఆమెకు చెప్పారు. కాంగ్రెస్ డబ్బిస్తే తీసుకుంటానని..ఓటు మాత్రం కారు గుర్తుకే వేస్తానని వృద్దురాలు మాటిచ్చింది. అవ్వతో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.