హైదరాబాద్ : సిటీలో నీళ్లివ్వలేని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తారా? ఎంతో గౌరవ ప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి నీచమైన భాష మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపై పోరాటం జరిపిన పార్టీ బీఆర్ఎస్ అని తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు.
పదేండ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిపారని ప్రశంసించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఖైరతాబాద్‌లో అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడాలి . త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.