హైదరాబాద్ : పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందన్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజల తరఫున పోరాడుతామన్నారు.
సనత్ నగర్‌లోని 87.31 ఎకరాల పారిశ్రామిక భూములను ఎకరం 6.31 కోట్ల రూపాయలు చొప్పున కట్టబెట్టడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఓపెన్ మార్కెట్లో ఎకరం ధర 43 నుంచి 45 కోట్ల రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్ నగరంలో 21 ప్రాంతాల్లో 9,292 ఎకరాల భూములను తక్కువ ధరకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు పాలసీని తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రజల అవసరాలను పట్టించుకోని ప్రజా ప్రభుత్వంపై కోట్లాడుతామన్నారు.