హైదరాబాద్, ఆగస్ట్ 19 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కళాశాలలను సిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకురాలు, మాజీ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహిస్తున్న నిరసనలపై ప్రభుత్వం స్పందించి వారి ఆందోళనలను పరిషరించాలని కోరారు. దశాబ్దాలుగా వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య, ఉపాధి అవకాశాలు అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థను విలీనం పేరిట నిర్వీర్యం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నదని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.
ఈసెట్ ద్వారా బీటెక్ సెకండియర్లో ప్రవేశం పొందే ల్యాటరల్ ఎంట్రీ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని వాపోయారు. తెలంగాణ సాంకేతిక విద్యామండలి ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా తెచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిల్ యూనివర్సిటీ మాడల్ పేరిట విద్యా వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, పేద విద్యార్థులపై ఫీజుల భారం మోపేందుకే ప్రభుత్వం ఈ విలీన నాటకమాడుతున్నదని మండిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాలల స్వయంప్రతిపత్తిని కాపాడుతూ, పాత పద్ధతిలోనే వాటిని కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించారు.