Talasani Srinivas Yadav | సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘ఉద్యమ చరిత్రను దీక్షతో మలుపు తిప్పిన ఘనత కేసీఆర్‌ది. పోరాట, పరిపాలన పటిమ బీఆర్ఎస్ పార్టీ సొంతం’ అని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్ పేరును చెరిపివేయడం సీఎం రేవంత్‌రెడ్డి తరం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా తలసాని అన్నారు.
2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని తలసాని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల కల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ చరిత్రలో గొప్ప నేతగా నిలిచారన్నారు. శుక్రవారం బేగంపేటలోని పాటిగడ్డలో తెలంగాణ భవన్ వరకు సాగిన భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. పాటిగడ్డ నుంచి తెలంగాణ భవన్ సమీపంలోని బసవతారకం క్యాన్సర్ దవాఖాన వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర తలసాని బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్‌కు పాదయాత్రగా ర్యాలీగా వెళ్లారు.
నగర నలుమూలల నుంచి తరలివచ్చిన గులాబీ శ్రేణులతో దీక్షా దివస్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు మంత్రి పదవి ఇస్తానని అప్పటి ప్రభుత్వం మభ్యపెట్టాలని చూసినా, పదవి తనకు వద్దని తెలంగాణ రాష్ట్రం కావాలని అడిగి గొంతెత్తిన ఉద్యమ నేత కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు నిలిచి ఉంటుందన్నారు. ఈ రోజు రాష్ట్రం బాగుపడిందంటే కేసీఆర్ పుణ్యమేనని చెప్పారు.
దీక్షా దివస్‌కు ఆటంకాలు
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకలకు అధికారులు అడుగడుగునా అటంకాలు కల్పించారు. వేడుకల కోసం తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు గులాబీ జెండాలు, తోరణాలు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా.. వాటిని తొలగించారు. తెలంగాణ భవన్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాదయాత్రగా వెళ్తున్న సమయంలో అధికారులు వీధి దీపాలను ఆర్పి వేశారు. చీకట్లోనే పాదయాత్రగా భవన్‌కు నడుచుకుంటూ వెళ్లారు. ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు గుర్తు చేసుకున్నారు.