అల్లాపూర్, నవంబర్ 4:భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ధీమా వ్యక్తం చేశారు. బోరబండ డివిజన్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో బంజారానగర్, స్వరాజ్‌నగర్‌కు చెందిన 100 మంది యవకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడడంతోపాటు సంక్షేమ పథకాలు ఆగిపోయాయని, మళ్లీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని నమ్మి యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ కాశిఫ్ మహ్మద్ అఫ్రోజ్, మహ్మద్ ఖలీల్ ఖురీషి, మహ్మద్ ఉమర్ ఖురేషి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ సలాం తదితరులు ఉన్నారు.