జూబ్లీహిల్స్, అక్టోబర్ 5: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు అమలవుతాయని.. ఇచ్చిన హామీలు అమలుచేయని కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్‌కు త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్‌తో కలిసి ఇంటింటికీ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విద్యా భరోసా కింద విద్యార్థులకు రూ. 5 లక్షలు, మహాలక్ష్మి పథకం కింద రూ.55 వేలు, చేయూత పథకం కింద వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు రూ.44 వేలు, విద్యార్థినులకు స్కూటీ, ఆడ బిడ్డల పెండ్లికి తులం బంగారం బాకీ పడినట్లు చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలో అత్యంత ఘోరంగా మోసం చేసింది ముస్లిం మైనార్టీలనే అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
కేసీఆర్ రాష్ట్రంలో 203 ముస్లిం మైనార్టీ స్కూళ్లను ప్రారంభించి దేశం అబ్బురపడే విధంగా పేద ముస్లిం బాల బాలికలకు కూడావిద్యనందిస్తే.. నేడు కాంగ్రెస్ పాలనలో ఆ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య రావు, గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.