మేడ్చల్, సెప్టెంబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులపై శీతకన్ను వేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని రామభ్రద క్షేత్రంలో శుక్రవారం క్షేత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక 9వ చతుర్వేద సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో లభించిన ప్రోత్సాహం దురదృష్టవశాత్తు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్పించడం లేదన్నారు. నిధులు విడుదల కావడం లేదని, తగిన ప్రోత్సాహం కరువైందన్నారు.
దీంతో విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. కేసీఆర్ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేశారన్నారు. దేశంలోనే ఆదర్శంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను తీర్చిదిద్దారన్నారు. కుల వృత్తులకు రాయితీలు ఇచ్చినట్టే అర్చక వృత్తిలోకే వచ్చే వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలన్నారు.
ప్రభుత్వ పరంగా వేద పాఠశాల విద్యార్థులకు గుర్తింపు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఇందుకోసం తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రామభద్ర క్షేత్రంలో వేద, శాస్త్ర, స్మార్త పరీక్షల్లో 500 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హరీశ్‌రావు పట్టాలను అందజేశారు. తెలంగాణలో వేద పరిరక్షణ కోసం ఈ సభలను నిర్వహించినట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు రాధా కృష్ణా శర్మ, రాఘవ శర్మ, కోశాధికారి రవిచంద్ర శర్మ తెలిపారు.