మహేశ్వరం, డిసెంబర్ 29: అర్హులందరికీ ప్రజాపాలన దరఖాస్తులు అందజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాపాలన ఫారాలను కొంత మందికే అందజేయడంతో చాలా మంది ప్రజలు అయోమయానికి గురవుతున్నారని.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి అందజేయాలని డిమాండ్ చేశారు. కౌంటర్ల వద్ద అప్లికేషన్ల కొరతతో ప్రజలు నెట్ సెంటర్లను ఆశ్రయించడం జరుగుతుందని.. కౌంటర్ల వద్ద కన్నా మీసేవా, జిరాక్స్, నెట్ సెంటర్ల వద్దనే ప్రజలు అధికంగా ఉంటున్నారని తెలిపారు. ప్రజా పాలన ఫారాలు అందక జిరాక్స్, నెట్ సెంటర్ వారు రూ.50 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఎల్బీనగర్ జోన్ బృందం, డిసెంబర్ 29: ప్రజాపాలన తొలిరోజు ఇబ్బందులను తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. ప్రజలు రెండో రోజు పెద్దఎత్తున కేంద్రాలకు వస్తుండటంతో ఆయా కేంద్రాల వద్ద రెండో రోజు ఏర్పాట్లు చేయడంలో జాగ్రత్త పడ్డారు. మొదటిరోజే దరఖాస్తు ఫారాల కొరతతో పాటు అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో రెండో రోజు ఆ సమస్య రాకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని 11 డివిజన్లలో ఒక్కో డివిజన్లో నాలుగు కేంద్రాల చొప్పున 44 కేంద్రాలను దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శుక్రవారం దాదాపుగా ఎక్కువ కేంద్రాల్లో రద్దీ వాతవరణం కనిపించింది. ప్రధానంగా దరఖాస్తు ఫారాలను నింపి సలహాలు అందించేందుకు వలంటీర్లను కూడా ఆయా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు.
బడంగ్‌పేట, డిసెంబర్ 29: రెండో రోజు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలను కమిషనర్ సుమన్ రావుతో కలిసి ప్రత్యేక అధికారి రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
మహేశ్వరం, డిసెంబర్ 29: సమస్యల పరిష్కారానికే ప్రజాపాలన నిర్వహిస్తున్నామని డిప్యూటీ తాసీల్దార్ నవత తెలిపారు. శుక్రవారం కోళ్లపడకల్‌లో ప్రజాపాలన దరఖాస్తులను విద్యుత్ ఏఈ చక్రపాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలం వ్యాప్తంగా నేడు 3722 ఫిర్యాదులు అందినాయని వెల్లడించారు. 28న 2258, 29వ తేదీలతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 5980 దరఖాస్తులు అందినాయని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి, ఎంపీటీసీ హనుమగల్ల చంద్రయ్య, ఆర్ఐ పావని, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు, డిసెంబర్ 29 : అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆర్డీవో సూరజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం దెబ్బడగూడ గ్రామంలో సర్పంచ్ ఏనుగు శ్రావణి జంగారెడ్డితో కలిసి దరఖాస్తు ఫారాలను అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాసీల్దార్ గోపాల్. కో-ఆప్షన్ మెంబర్ సులేమాన్, కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.