మేడ్చల్, జనవరి 25(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ‘నమస్తే’తో మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో గెలుపే ధ్యేయంగా బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధమయ్యారన్నారు. భరోసా లేని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించినట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు. ఎల్లంపేట, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల పరిధిలో రెండు మూడు రోజుల్లో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మల్లారెడ్డి వెల్లడించారు.
మున్సిపల్ బరిలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక నాయకుల, కార్యకర్తల నిర్ణయం మేరకు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎవరికీ పోటీ చేసే అవకాశం వచ్చినా..కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. త్వరలో నిర్వహించే సమావేశాల్లో ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నట్లు మల్లారెడ్డి వివరించారు. ఇప్పటికే మూడు మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్చార్జిలను బీఆర్ఎస్ అధిష్టానం నియమించిందన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి మూడు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు.