మేడ్చల్: తెలంగాణపై కుట్రల ప్రయత్నాలు జరుగతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చక హైదరాబాద్‌లో పచ్చ జెండాల ఊరేగింపు జరిగిందని శాసన మండలి మాజీ చైర్మన్, మేడ్చల్ జిల్లా దీక్షా దివస్ ఇన్చార్జి స్వామిగౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ సమీపంలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అధ్యక్షతన దీక్షా దివస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్వామిగౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించారని, అలాంటి తెలంగాణలో మళ్లీ కుట్రలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దరిద్రపు గొట్టు కాంగ్రెస్ ప్రభుత్వం
-మాజీ మంత్రి మల్లారెడ్డి
దరిద్రపు గొట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఎగ్గోడుతున్నది. తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేండ్ల కాలంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా నిలిపారు. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు ప్రజల తరపున పోరాడుదాం.
పోరాటం చేద్దాం
-కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు పోరాటం చేద్దాం.తెలంగాణలో మళ్లీ ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది. కేసీఆర్ పాలనలో పదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. బీఆర్ఎస్దే అధికారం
-కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. పదేండ్ల కాలంలో కేసీఆర్ రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి లూటీ చేస్తున్నది. దొంగ వాగ్ధానాలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలకు అందే వరకు పోరాటాలు చేద్దాం.
కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించా
-మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించేది లేదు. చావును సైతం లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలో అ విధంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.
డిపాజిట్లు దక్కవని సర్వేలు తేల్చాయి
– ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు
బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా డిపాజిట్లు దక్కవని పలు సర్వేలు తేల్చాయి. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ప్రజలే స్వయంగా అంటున్నారు.