మేడ్చల్, మే8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్నులకు 5శాతం రాయితీని ప్రకటించిన నేపథ్యంలో 33 రోజులలో రూ.103 కోట్ల ఆస్తి పన్నులు వసూళ్లు అయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి ఈనెల 3 వరకు ముందస్తు ఆస్తి పన్నులు చెల్లించిన వారికి 5 శాతం రాయితీని అందించారు. దీంతో జిల్లాలోని 13 మున్సిపాలిటీలలో 28శాతం ఆస్తి పన్నుల వసూళ్లు జరిగాయి.
నాలుగు కార్పొరేషన్ల పరిధిలో బోడుప్పల్లో రూ.8.98 కోట్లు, పీర్జాదిగూడ రూ.12.96 కోట్లు, జవహర్నగర్ రూ. 2.35 కోట్లు, నిజాంపేట్ రూ.26 కోట్లు వసూళ్లు జరగగా మున్సిపాలిటీలలో పోచారంలో రూ.4.28 కోట్లు, తూముకుంట రూ. 6.70 కోట్లు, నాగారంలో రూ.7.40 కోట్లు, మేడ్చల్లో రూ. 5.05 కోట్లు, కొంపల్లిలో రూ. 5.11 కోట్లు, ఘట్కేసర్లో 2.03 కోట్లు, గూండ్లపోచంపల్లిలో 7.76 కోట్లు, దమ్మాయిగూడలో రూ. 3.91 కోట్లు, దుండిగల్లో రూ.11.16 కోట్ల మేర పన్ను వసూళ్లు అయ్యాయి.
పన్ను వసూళ్లపైనే దృష్టి..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలలో ఆస్తిపన్నుల వసూళ్లపై పెడుతున్న దృష్టి ఆయా ప్రాంతాల అభివృద్ధిపై పెట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శివారు ప్రాంతాల మున్సిపాలిటీలలో అనేకంగా నూతన కాలనీలు ఏర్పడుతున్న క్రమంలో మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి కూడా ప్రత్యేక నిధులు కేటాయించలేదు.
దీనికితోడు మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగతున్న క్రమంలో ప్రత్యేక అధికారులు మున్సిపాలిటీలలో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలె మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరో 24 గ్రామాలను కలిపి మూడు నూతన మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఆయా చోట్ల అభివృద్ధి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లపై పెట్టే దృష్టి మౌలిక వసతుల కల్పినపై కూడా పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.