నఖల్ మార్నేకో అఖల్ రహ్నా.. అంటే కనీసం నఖలు కొట్టేందుకైనా కాస్త తెలివి ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్‌కు అది కూడా లోపించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను కాస్త అటుఇటుగా మార్చి.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోగా ప్రకటించుకోవడమంటే కొంతైనా తెలివి ఉన్నట్లు. కానీ, కండ్ల ముందు జరుగుతున్న పనులను తాము అధికారంలోకి వస్తే చేపడతామంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించుకోవడం బహుశా దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. అసెంబ్లీ ఎన్నికల దరిమిలా కాంగ్రెస్ జాతీయ నేతలు.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మధించి ప్రజల ముందు ఉంచిన మ్యానిఫెస్టోను చూస్తే హస్తం నేతల ఢొల్లతనమేందో ఇట్టే అర్థమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి సంబంధించి పొందుపరిచిన అంశాలను చూస్తే మ్యానిఫెస్టో రూపకల్పన అనేది ఆలోచన ప్రాతిపదికన కాకుండా.. నగరంలో కారులో తిరుగుతూ, జరుగుతున్న అభివృద్ధిని మ్యానిఫెస్టోగా రూపొందించినట్లుగానే ఉంది. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవ ప్రతీకగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ఇప్పటికే నగరంలో లక్ష పూర్తవగా, మరో లక్ష కూడానిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో నగరానికి సంబంధించి డబుల్ బెడ్రూం అనిగానీ.. నిరుపేదలకు గూడు కల్పిస్తామని గానీ ఎక్కడా లేదు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ):
ఉస్మానియా ఆస్పత్రిని హెరిటేజ్‌గా గుర్తించి.. పూర్తిస్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాం..
నాలుగు అధునాతన మెటర్నిటీ, వెటర్నరీ, రెండు అధునాతన ఈఎన్టీ, రెండు అధునాతన సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రులను నిర్మిస్తాం.
హెచ్ఎండీఏ పరిధిలోని మురికివాడల సమగ్ర అభివృద్ధికి స్లమ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తాం..
నగరాల్లో మోడరన్ మల్టీపర్పస్ పార్కులు ఏర్పాటు చేస్తాం..
హైదరాబాద్ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్ది నాలాల ఆధునీకరణ చేపడతాం..
గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని నగరాలు, మున్సిపాలిటీల్లో.. ప్రతి ఇంటికి 25వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా సరఫరా చేస్తాం..
ఎల్బీనగర్ నుంచి బీహెచ్ఈఎల్ (వయా ఆరాంఘర్-మెహిదీపట్నం-గచ్చిబౌలి) రూట్లలో కొత్త మెట్రో లైన్లను విస్తరింపజేస్తాం..
నవ్వులు పుట్టిస్తున్న కాంగ్రెస్ మ్యానిఫెస్టో
సిటీబ్యూరో, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మ్యానిఫెస్టోను చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ తరహా ఆ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి విజన్ లేదని తేలిపోయిందన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో మా ప్రభుత్వం దేశంలోనే ఆదర్శ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దినట్లు తలసాని చెప్పారు. అంతేకాదు విశ్వనగరానికి అవసరమైన హంగులను సమకూర్చుతుందని, ఇప్పటికే అనేక అభివృద్ధి పథకాలు ఆచరణలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బృహత్ ప్రణాళికలు ఉన్నాయని, పురోగతిలో పనులను పూర్తి చేస్తామన్నారు. మేం అమలు చేస్తున్న పథకాలనే కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో పెట్టిందే తప్ప.. కొత్తగా ఏమి పెట్టలేదన్యాను. ప్రజల అభివృద్ధి అక్కర్లేదు.. పదవుల పంచాయతీ, కుర్చీల కోసం ఒకరి కాలు ఒకరు లాక్కోవడానికే వారికి సమయం పడుతుందే తప్ప ప్రజలపై ఆరాటం అసలు ఉండదని తలసాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదన్నారు. ఎలాగు గెలిచేది లేదు.. కాబట్టే ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రజలు అమాయకులేం కాదని, కచ్చితంగా కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.