కార్వాన్, డిసెంబర్ 21: ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న జాతీయ కుస్తీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ విభాగాలకు నగరంలోని పలువురు యువ మల్ల యోధులతో పాటు మహిళా విభాగంలోని యువతులు తమ సత్తా చాటి జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ కుస్తీ పోటీల కోసం కార్వాన్ సబ్జీమండీలోని వీరాభిమన్యు వ్యాయామశాలలో తెలంగాణ రాష్ట్ర అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జాఫర్ పహిల్వాన్ అధ్వర్యంలో అంతర్జాతీయ రిఫరీ సన్నీబాబు, ఈవెంట్ సెక్రెటరీ కట్టా శ్రీనివాస్ నేతృత్వంలో బాల బాలికల కోసం 67వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-19 మల్ల యోధులు కుస్తీ పోటీలను నిర్వహించారు.
ఇందులో 50 కేజీల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన బాలికలు- తనీషా, 55 కేజీల విభాగంలో నజ్మా, 53 కేజీల విభాగంలో జె. చిన్ని,(వరంగల్), 76 కేజీల విభాగంలో ఆదిలాబాద్‌కు చెందిన సహస్ర ఎంపికయ్యారు. అదే విధంగా బాలుర విభాగంలో అండర్-19 ప్రీ స్టయిల్ విభాగంలో 57 కేజీల విభాగంలో షేక్ అజీం, 74 కేజీల విభాగంలో రవికాంత్ (రంగారెడ్డి), 125 కేజీల విభాగంలో ఆదిత్య యాదవ్(హైదరాబాద్) ఎంపికయ్యారు. అండర్-19 గ్రీకో రోమన్ ైస్టెయిల్ విభాగంలో 55 కేజీల విభాగంలో రాహుల్ (వరంగల్) 63 కేజీల విభాగంలో సందీప్ (మహబూబ్ నగర్) 72 కేజీల విభాగంలో పవన్ (రంగారెడ్డి), 87 కేజీల విభాగంలో వరణ్ (హైదరాబాద్) ఎంపికైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.