హిమాయత్‌నగర్, డిసెంబర్ 4 : నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదచారుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హిమాయత్‌నగర్ డివిజన్లో రద్దీ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రణాళికలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రూ.2.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయితే ఈ నిర్మాణం ఎక్కడ చేపట్టాలి.. చేపడితే తలెత్తే సమస్యలు ఏమిటి..ఎంపిక చేసిన ప్రాంతంతో ఎంత మంది ప్రజలకు ప్రయోజనం ఉంటుందనే అనే అంశాలపై జీహెచ్ఎంసీ అధికారులు అధ్యాయనం చేయకుండానే హడహుడిగా 2020 ఆగస్టు నెలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు హిమాయత్‌నగర్‌లో రోడ్డును తవ్వి పనులు ప్రారంభించారు.
బ్రిడ్జి ఏర్పాటుతో తమ దుకాణాలకు అడ్డుగా ఉంటుందని భావించి కొందరు వ్యాపారులు అడ్డుకోవడంతో అనూహ్యంగా వివాదం తలెత్తింది. ఫలితంగా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వంతెన కోసం తవ్విన గుంతలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగడంతో గుంతలను పూడ్చేశారు. హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతంలో అధిక శాతం విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, బ్యాంకులు ఉన్నాయి. హిమాయత్‌నగర్ ప్రధాన మార్గంలో రోడ్డు దాటాలంటే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు నానాఅవస్థలు పడుతున్నారు. వేగంగా వచ్చే వాహనాలను దాటుకుంటూ వెళ్లడం అనేది కత్తిమీద సాములా మారింది. ఈ రోడ్డులో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా ఫుట్ ఓవర్ బ్రిడ్జికి స్థలాన్ని గుర్తించి అడ్డుంకులను తొలగించి త్వరగా నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
అడ్డంకులు తొలిగిన వెంటనే పనులు చేపడుతాం..
ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో స్థానికంగా కొన్ని అడ్డంకులు రావడంతో నిలిపివేయడం జరిగింది. అడ్డంకులు తొలిగిన వెంటనే పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేందుకు చర్యలు తీసుకుంటాం.
– ఈఈ శంకర్, అంబర్‌పేట సర్కిల్-16
నిర్మాణ పనులు చేపట్టాలి..
పెరుగుతున్న ట్రాఫిక్‌తో రోడ్డు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు దాటలేని పరిస్థితి. వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే సులువుగా రోడ్డు దాటే వీలు కలుగుతుంది. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలి.
– టి.అంజయ్య, హిమాయత్‌నగర్