Niloufer Hospital | తెలుగు యూనివర్సిటీ, మార్చి 25 : చిన్నపిల్లలు, ప్రసూతి దవఖానగా పేరొందిన నీలోఫర్ దవఖాన భవనాలను అనుసంధానం చేస్తూ జీహెచ్ఎంసీ నిర్మించిన పుట్ ఓవర్ బ్రిడ్జ్ నిరుపయోగంగా మారాయి. నీలోఫర్ పాతభవనం నుండి ఇంటెన్సివ్‌కేర్ యూనిట్ భవనంలోకి రోగులు, వారి సహాయకులు, ఉద్యోగులు ఆయా పనుల నిమిత్తం రాకపోకలు సాగించాలంటే ఆ భవనాల మధ్యన ఇరుకైన రోడ్డు మార్గంలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణతో పాటు దవఖానాకు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండేలా గత రెండు సంవత్సరాల క్రితం జీహెచ్ఎంసీ తన సొంత ఖర్చులతో రెండు భవనాలను కలుపుతూ ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించింది. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి రాకపోకలు సాగించడంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇరువైపులా లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.
కానీ వాటి నిర్వహణ మాత్రం ఓ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. అలంకార ప్రాయంగా మారిన లిఫ్ట్‌లను ఆపరేట్ చేసే విషయంలో పర్యవేక్షణ లేకపోగా అవి నామమాత్రంగా మిగిలిపోయాయి. ఆపసోపాలు పడుతూ మెట్లపై నుండి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వైద్యం కోసం వచ్చేవారు తొందరలో రోడ్డు దాటుతూ రద్దీగా ఉండే దారిలో ప్రమాదాలకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి ఫుట్ఓవర్ బ్రిడ్జికి అనుసంధానంగా ఉన్న లిఫ్ట్‌లను పునరుద్దరించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.
లిఫ్ట్‌లను పునరుద్దరించాలని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు : సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ రవికుమార్
నీలోఫర్ పాత భవనం, ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ భవనాలను అనుసంధానం చేస్తూ రోగులు, వారి సహాయకులు, దవఖానా ఉద్యోగులు, సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా జీహెచ్ఎంసీ పుట్ఓవర్ బ్రిడ్జితో పాటు లిఫ్ట్‌లను ఏర్పాటు చేయడం మంచి పరిణామమే. కానీ నిర్వహణను గాలికి వదిలేయడం మాత్రం మంచి పద్దతి కాదు. సంబంధిత శాఖ అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాను. వారు స్పందించడం లేదు. వెంటనే పుట్ఓవర్ బ్రిడ్జికి అనుసంధానంగా ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లను పనిచేసేలా కాంట్రాక్టర్ చర్యలు చేపట్టేల జిహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలి.