సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే మలక్‌పేటలో సావరియా ఫుడ్ ట్రేడర్స్ అండ్ టిప్ టాప్ ఫుడ్స్, ఎల్లారెడ్డిగూడలోని టేస్టీ స్పైసీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్, శ్రీనగర్ కాలనీలో మేఘ కర్రీ పాయింట్, ఉప్పల్‌లోని పిస్తా హౌజ్‌లపై తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పదార్ధాల తయారీని గుర్తించి సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తెలిపారు.