Ameerpet | అమీర్పేట్, జూలై 5 : ఆ రోడ్డులో వరద నీటి కాలువను నిర్మించామనే విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులే మరచిపోయారు. దాదాపు ఆరేండ్ల క్రితం 450 ఎంఎం డయాతో నిర్మించిన ఈ వరద నీటి కాలువ నిర్వహణ పనులను జిహెచ్ఎంసి విస్మరించింది. గత ఆరేళ్లలో ఈ నాలా నుండి ఒక్కసారి కూడా పూడికలు తొలగించిన పాపాన పోలేదు. సనత్ నగర్ స్వామి థియేటర్ నుండి అయ్యంగార్ బేకరి మీదుగా మాత టెంట్ హౌస్ వెళ్లే దారిలో ఉన్న దాదాపు 50 మీటర్ల పొడవు వరదనీటి కాలువలో పూడిక తొలగింపు పనులను ఇప్పటికైనా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రెండేళ్ల క్రితం అయ్యంగార్ బేకరీ నుండి మాత రెంట్ హౌస్ మీదుగా దాచారం హాట్స్ వరకు సిసి రోడ్డు నిర్మాణ పనులకు అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
అయితే ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఈ రోడ్డు నిర్మాణ పనులకు మోక్షం లభించింది. ఈ మేరకు జిహెచ్ఎంసి ఇక్కడ కొత్త రోడ్డు నిర్మాణానికి ముందు చేపడుతున్న తవ్వకాల్లో ఈ వరదనీటి కాలువ విషయo వెలుగు చూసింది. 450 ఎంఎం డయాతో ఉన్న ఈ వరద నీటి పైపులైను పూర్తిగా పూడికతో నిండిపోయింది. ఒకటి రెండు రోజుల్లో ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టనున్న పరిస్థితుల్లో, అంతకంటే ముందే పూడుకు పోయిన వరదనీటి కాలువలలో నుండి సిల్క్ తొలగింపు పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి 450 ఎంఎం డయాతో ఉన్న నాలాలో పూడిక తొలగింపు పనులను పూర్తిస్థాయిలో చేపట్టిన తర్వాతే రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని జిహెచ్ఎంసి డీఈఈ సందీప్ తెలిపారు.