Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి వాన దంచికొట్టింది. రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఆకాశాన్ని చిల్లు పడిందా అన్నట్టు కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని కొన్ని కాలనీలు నీట మునిగాయి. నివాసాల్లోకి వర్షపు నీరు రావడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలానగర్, సత్యసాయి నగర్, బడంగ్పేట్తో పాటు తదిరత ప్రాంతాల్లోని కాలనీల్లోని వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ఇండ్లు నీట మునిగాయి. ఈ కాలనీలన్నీ చెరువులను తలపించినా.. అధికార యంత్రాంగం మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో స్థానిక ప్రజలు అధికారులు, నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. శనివారం రాత్రి 11గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నాంపల్లి బేగంబజార్‌లో 11.7సెం.మీ., చార్మినార్‌లో 10.6సెం.మీ, ఖైరతాబాద్ 9.4సెం.మీ, ఆసిఫ్‌నగర్ 9.1సెం.మీ, హయత్‌నగర్‌లో 9.0సెం.మీ, ముషీరాబాద్‌లో 8.6సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 8.5సెం.మీ, అంబర్‌పేటలో 8.4సెం.మీ, బహదూర్‌పురలో 7.2సెం.మీ,అమీర్‌పేటలో 6సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.