VST | ముషీరాబాద్, సెప్టెంబర్ 28: ఒకవైపు పైపులైన్ పనులు.. మరోవైపు రోడ్డుపై అమ్మవారి మండపం, బారికేడ్ల ఏర్పాటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటు వైపువెళ్లాలో తెలియని తికమకపడుతున్నారు. రాంనగర్ వీఎస్టీ వద్ద వరదనీటి పైపులైన్ పనులు జరుగుతుండటంతో గత నాలుగు రోజులుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. అయితే.. ట్రాఫిక్ పోలీసులు రాంనగర్ వైపు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి.. నాగమయ్యకుంట వైపు ట్రాఫిక్ రాకుండా బారికేడ్ అడ్డుపెట్టారు.
దీంతో ట్రాఫిక్ గందరగోళంగా మారింది. నాగమయ్యకుంట రోడ్డు మూలమీద దుర్గాదేవి అమ్మవారి మండపాన్ని అనుమతి లేకుండా ఏర్పాటు చేయడంతో రాంగనర్ నుంచి స్టీల్ బ్రిడ్జి ఎక్కడానికి దారిలేదు.. బ్రిడ్జి దిగి రాంనగర్ వెళ్లాలన్నా దారిలేదు.. మొన్నటివరకు వినాయక విగ్రహాలతో రోడ్డును బ్లాక్ చేసి.. ఇప్పుడు అమ్మవారి మండపం ఏర్పాటుతో అక్కడి నుంచి వెళ్లడానికి దారిలేకుండా చేస్తున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.
అయితే.. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు మండప నిర్వాహకులకు చెప్పినా వారు వినడంలేదని సమాచారం. దీంతో పార్శిగుట్ట, రాంనగర్, లలితానగర్, అడిక్‌మెట్ ప్రాంతాల ప్రజలు నాగమయ్య కుంట నాలా రోడ్డు మీదుగా స్టీల్ బ్రిడ్జి ఎక్కడానికి, దిగినవారికి దారిలేకుండా పోయింది. దీంతో విద్యానగర్ మెయిన్ రోడ్డుమీద నుంచి చుట్టూ తిరిగి రాంనగర్‌కు వెళ్లాల్సివస్తుందని వాహనదారులు వాపోతున్నారు.
స్టీల్ బ్రిడ్జి మీదుగా రాంనగర్ వెళ్లడానికి వీలులేకుండా నాగమయ్యకుంట మూల రోడ్డుపై అమ్మవారి మండపం ఏర్పాటు చేయగా, ట్రాఫిక్ పోలీసులు బారికేడ్‌ను అడ్డుగా పెట్టారు. దీంతో వాహనదారులు ఎటువెళ్లాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో నాగమయ్యకుంట బస్తీ రోడ్డు ఎడమవైపునకు దారి ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ రోడ్డుపై అమ్మవారి మండపాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా నాగమయ్యకుంట రోడ్డుపై మండపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.