Rain Update | సిటీబ్యూరో/మణికొండ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం తెల్లవారుజాము నుంచి గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. హయత్‌నగర్‌లో అత్యధికంగా 3.55 సెం.మీలు, సరూర్‌నగర్‌లో 3.45 సె.మీలు, వనస్థలిపురంలో 3.40 సెం.మీలు, బండ్లగూడ 3.35 సెం.మీలు, ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీలో 3.33 సెం.మీలు, మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో 3.15 సెం.మీలు, నాగోల్‌లో 3.13 సెం.మీలు, పాతబస్తీలోని యాకుత్‌పురా, గోల్కొండ, లంగర్‌హౌస్‌లో 3.0 సెం.మీలు, పాతబస్తీలోని చందూలాల్ బారాదరి, బహుదూర్‌పురాలో 2.93 సెం.మీలు, రాజేంద్రనగర్‌లో 2.88 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు.
జంట జలాశయాలకు వరద పోటెత్తుతున్నది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన దరిమిలా.. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను సూచించారు. క్షేత్రస్థాయిలో అత్యవసర బృందాలు, ఎస్పీటీ వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ముందస్తుగా సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ తెలిపారు.