Himayat Sagar | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీకి వరద ఉధృతి పెరిగింది. మూసీ నది పరవళ్లు తొక్కుతోంది.
ఉస్మాన్ సాగర్(గండిపేట్) 3 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు 920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్‌కు 100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ 2 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 1,017 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే వరద భారీగా ఉన్న నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ నుంచి 3 వేల క్యూసెక్కుల వరకు, హిమాయత్ సాగర్ నుంచి 2 వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు. అంటే మొత్తంగా మూసీలోకి శనివారం రాత్రి నాటికి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉంది.
మూసీకి వరద పెరగడంతో.. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లంగర్ హౌజ్, పురానాపూల్, చాదర్‌ఘాట్, అంబర్పేట్, చైతన్యపురితో పాటు తదితర ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తున్నారు.
దసరా పండుగకు ముందు.. మూసీకి వరద పోటెత్తడంతో.. నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్‌ను కూడా వరద నీరు చుట్టుముట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాదర్‌ఘాట్, అంబర్‌పేట వద్ద పలు ఇండ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటనల నుంచి తేరుకోక ముందే మళ్లీ మూసీకి వరద పెరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.