సిటీబ్యూరో: దక్షిణ డిస్కం పరిధిలో విద్యుత్ వినియోగం వంద మెగా యూనిట్లు దాటుతున్న క్రమంలో వేసవి కాలంలో ప్రమాద ఘంటికలు మోగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగం పెరుగుతుండడంతో గ్రేటర్‌తో పాటు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయమేర్పడుతుంది. ఏప్రిల్ రెండోవారం నుంచే గ్రేటర్లో విద్యుత్ వినియోగం 90-100 మెగా యూనిట్లకు చేరుతుండడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఈసారి 110 మెగా యూనిట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఏప్రిల్ మొదటివారం నుంచే విద్యుత్ వినియోగం పెరిగి గత ఐదారురోజులుగా 95మెగా యూనిట్లకుపైగా వినియోగం నమోదవుతోంది.
మరోవైపు ట్రాన్స్ఫార్మర్లలో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్పై 130 యాంప్స్ లోడ్ దాటిపోతున్నదని అంటున్నారు. ఆఫీసులో 315 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో అన్ని ప్రాంతాలు కవర్ చేయలేకపోతున్నామంటున్నారు. కాగా, కరెంటు సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 1912తో పాటు ఎక్స్ వేదికగా పలువురు ఫిర్యాదు చేశారు. నాలుగురోజులుగా రోజూ 20 నుంచి 30వేల వరకు అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అత్యధికంగా నగరం నుంచే వస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. గత నెలలో 9.3 లక్షల ఫిర్యాదులు రాగా, ఇప్పుడు కేవలం నాలుగైదు రోజుల్లోనే ఫిర్యాదుల సంఖ్య 2 లక్షల దాటిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు.