జీడిమెట్ల, అక్టోబర్ 4 : ఖాళీ స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసిన ఓ మహిళతో పాటు మరో ఐదుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ సురేశ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఉప్పుగూడలో నివాసముండే సురేశ్‌కు వెంకటాద్రినగర్ సర్వే నంబర్ 33/8 , 33/11 లో కోటి రూపాయలు విలువ చేసే 200 గజాల స్థలం ఉంది. ఈ స్థలంపై కన్నెసిన సుభాష్‌నగర్‌కు చెందిన ప్రధాన నిందితురాలు వరుసకు సోదరి అయిన ఓ మహిళ పేరిట నకిలీ పత్రాలను సృష్టించింది.
ఇందుకు గగనం నరేంద్ర అలియాస్ నందు, రవి శంకర్, హరీశ్, రేపాక కరుణాకర్ అనే వ్యక్తుల సహకారం తీసుకుంది. వారితో కలిసి నకిలీ పాన్ కార్డులను తయారు చేయించి.. ఆధార్ కార్డులలో పేర్లను మార్పులు చేయించారు. సదరు కార్డులను ఉపయోగించి ప్రధాన నిందితురాలు స్థల యజమాని మృతి చెందినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులను బురిడీ కొట్టించింది. అధికారులు సమగ్రంగా విచారించకుండనే నిందితురాలి సోదరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
సదరు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి లోపల చిన్న పాటి డబ్బాను ఏర్పాటు చేయించారు. ఇటీవల సురేశ్ తన స్థలాన్ని చూసేందుకు వెంకటాద్రినగర్‌కు వచ్చాడు. తన స్థలంలో గోడ నిర్మాణం చూసి కంగుతిన్నాడు. ఈ విషయమై స్థానికుల వద్ద అరా తీయగా, ఓ మహిళ కబ్జా చేసినట్లు తెలుసుకున్నాడు. ఆమెను నిలదీయగా, తన వద్ద పక్కాగా పేపర్లు ఉన్నాయని, ‘నీకు ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదం’టూ..బెదిరింపులకు పాల్పడింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి.. నిందితులను అరెస్టు చేశారు.