సిటీబ్యూరో/అబిడ్స్/సుల్తాన్‌బజార్, జనవరి 25(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని బచాస్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళతో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్లాస్టిక్, కెమికల్స్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి విషపూరిత పొగతో ఊపిరాడక మరనాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం మొదట ఒక మృతదేహాన్ని వెలికితీయగా, ఆ తర్వాత మిగతావి బయటకు తీసుకొచ్చారు.
ఇందులో ఇద్దరు పిల్లలు ఒకరినొకరు అతుక్కుని అలాగే ఉన్నారని, మహిళ అక్కడ ఉన్న రూమ్‌లో విగతజీవిగా పడి ఉందని, మిగతా ఇద్దరి మృతదేహాలు సెల్లార్లో తలొకచోట పడి ఉన్నాయని రెస్క్యూ టీమ్స్ చెప్పాయి. సుమారుగా 22 గంటల పాటు పెద్ద ఎత్తున శ్రమించి మంటలు, పొగను అదుపులోకి తెచ్చిన తర్వాత భవనం సెల్లార్నుంచి మృతదేహాలను రెస్క్యూటీమ్స్ వెలికితీశాయి. అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బేస్మెంట్ను పూర్తిగా దుర్వినియోగం చేశారని, ఈ ప్రమాదానికి కారణం ప్రాథమికంగా షార్ట్‌సర్క్యూట్ అని అధికారులు చెప్పారు. నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలోని అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిహారం ప్రకటించారు.
నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, అందులో ఒక మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు భవన వాచ్మెన్ యాదయ్య, లక్ష్మి పిల్లలైన అఖిల్(11), ప్రణీత్(7), భవనంలో స్వీపర్‌గా పనిచేస్తున్న గుల్బర్గాకు చెందిన బెనాబి(50), ఫర్నిచర్ షాపులో పనిచేసే మహ్మద్ ఇంతియాజ్(26), డ్రైవర్ సయ్యద్ హబీబ్(30)లుగా పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎర్రగళ్లపల్లికి చెందిన యాదయ్య పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఈభవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు.
గన్‌ఫౌండ్రీలోని ఆలియా ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అఖిల్, 3వ తరగతి చదువుతున్న ప్రణీత్‌లు స్కూల్ కు పోకుండా ఇంట్లోనే ఉండి సెల్లార్లో ఆడుకుంటూ అక్కడే చిక్కుకుపోయి దట్టమైన పొగకు ఊపిరాడక చనిపోయారు. సయ్యద్హబీబ్ది ముస్తఫానగర్‌లోని శాస్త్రిపురం కాగా మహ్మద్ ఇంతియాజ్ది నాంపల్లిలోని సుభాన్పురాగా పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురి మృతితో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
నాంపల్లి సుభా న్పురాకు చెందిన మహమ్మద్ ఇంతియాజ్ బాచాస్ ఫర్నీచర్ మాల్లో ట్రాన్స్పోర్ట్ లిఫ్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజేంద్రనగర్ శాస్త్రిపురానికి చెందిన సయ్యద్ హబీబ్ ఫర్నిచర్ మాల్లో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంతియాజ్, హబీబ్ ఇద్దరూ బయటే ఉన్నా.. భవనంలోని సెల్లా ర్-2లో చిక్కుకున్న అఖిల్, ప్రణీత్‌లను కాపాడేందుకు సెల్లార్లోకి వెళ్లడంతో అప్పటికే మంటలు అధికమై పొగ పేరుకుపోవడంతో మృత్యువాత పడ్డారని సహాయక బృందాలు చెప్పాయి.
మాల్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న గుల్బార్గాకి చెందిన సమీర్ తల్లి బీరన్ బీ(60 ), తన కుమారుడికి వంట చేస్తూ సెల్లార్లో కేటాయించిన గదిలో ఉంటోంది. పొగలో ఊపిరాడక మృతి చెందింది. అగ్ని మాపక అధికారులు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఆదివారం ఉదయం 9.15 గంటలకు బీరన్బీ మృతదేహాన్ని గుర్తించారు. మిగిలిన మృతదేహాలను వెలికితీశారు.
తన కుమారులు శనివారం బడికి వెళ్లి ఉంటే ఈ ప్రమాదంలో చనిపోయేవారు కాదంటూ మృతులు ప్రణీత్, అఖిల్‌ల తండ్రి యాదయ్య గుండెలవిసేలా ఏడ్చారు.
శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఆదివారం ఉదయం పదకొండుగంటల వరకు సుమారు 22గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 23 ఫైరింజన్లు, జేసీబీలు తదితర సామగ్రి ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది లోపలకు వెళ్లేందుకు మార్గం ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలు కష్టమయ్యాయి.
అదే సమయంలో డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలకు వెళ్లగా అందులో ఒకరికి ఆక్సీజన్ అందక వారు సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. సెల్లార్లో కెమికల్స్ తీవ్రత అధికంగా ఉండడం వల్లే ఫైర్ సిబ్బంది లోపలకు వెళ్లడం సాధ్యపడలేదు. మెట్లమార్గం నుంచి పైకి వచ్చేందుకు ప్రయత్నించినా అక్కడ ఒక ఇనుప షట్టర్‌కు తాళం వేసి ఉండడంతో వారు రాలేకపోయారు. మృతులు సెల్లార్లోనే చిక్కుకుని పోయారని అధికారులు చెప్పారు.
నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతులకు ఉస్మానియా దవాఖాన మార్చురీలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఎమ్మెల్సీ రహమత్ బేగ్ నాయకులతో కలిసి మార్చురీకి చేరుకొని మృతుల కుటుంబీకులను ఓదార్చారు. హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్లు నమీముద్దీన్, నిహారిక, ప్రవీణ్,జ్యోతి ఇతర సిబ్బందితో కలిసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
ఇదిలా ఉండగా అగ్ని ప్రమాద ఘటనలో మృత్యువాత పడిన చిన్నారుల బంధువులు పార్ధీవ దేహ వాహనాన్ని నిలిపి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇక్కడికి రావాలని నినాదాలు చేశారు.5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి రావాలని పట్టుబట్టడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని సముదాయించి అక్కడి నుండి పంపించి వేశారు.
సెల్లార్లో మెటీరియల్ వల్లే మంటలు నాంపల్లిలో అగ్నిప్రమాదానికి సంబంధించి కాల్ రాగానే రెండు నిముషాల్లో ఘటనాస్థలానికి చేరుకున్నామని అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్‌సింగ్‌మాన్ వెల్లడించారు. సెల్లార్లో ఫర్నిచర్ మెటీరియల్, రెగ్జిన్, కెమికల్స్ నిల్వ ఉంచారని, వీటివల్లే మంటల తీవ్రత ఎక్కువైందన్నారు.
సెల్లార్లో మెటీరియల్ వల్లే మంటలు వ్యాపించాయని, అందులో ఐదుగురు చిక్కుకున్నారని, మెట్లపై కూడా మెటీరియల్ స్టోర్ చేయడంతో మంటలు అంటుకుని ఆ మార్గం సైతం మూసుకుపోయిందని చెప్పారు. నాంపల్లి అగ్నిప్రమాదం జరిగిన భవనం యజమాని సతీశ్ బచ్చాను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాద ఘటనలో మృతిచెందిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.