సిటీబ్యూరో, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ): తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కుతున్నారు. మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా దురుద్దేశంతో డబ్బులు తేలికగా వస్తున్నాయనే నెపంతో గంజాయి సరఫరాకు దిగాడు ఓ ఉద్యోగి. ఈ క్రమంలోనే హెచ్ఎంటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ వస్తున్న జీతంతో ప్రవీణ్‌వర్మ భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలని భావించకుండా అక్రమ మార్గంలో గంజాయి అమ్మకాలు చేపట్టి సొమ్ము చేసుకోవాలని చూసి ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులకు పట్టబడిన ఘటన ఆదివారం చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ నుంచి అల్వాల్‌కు వస్తున్న క్రమంలో ఎస్టీఎఫ్ టీం సీఐ వెంకటేశ్వర్లు తన బృందంతో కలిసి అనుమానం వచ్చి కారును నిలిపి తనిఖీలు చేపట్టారు. కారు డోరుతోపాటు బానెట్‌లో గంజాయి ప్యాకెట్లను దాచి ఉంచి తీసుకువస్తున్నట్లు కనిపెట్టిన పోలీసులు వాటిని బయటకు తీయగా.. పది కిలోల గంజాయి ఉన్నట్లు తేలింది. కారులోని ఇద్దరు డ్రైవర్లు తంగళ్ల శేఖర్, పి.అనిల్కుమార్లను అరెస్ట్ చేయడంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేసిన ప్రవీణ్‌వర్మ పరారీలో ఉన్నట్లు అతడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇటీవల ప్రవీణ్ వర్మ జూమ్‌లో కారు బుక్ చేసి ఏఓబీ ఆంధ్ర-ఒరిశా బార్డర్‌లోని అరకు వరకు కారులో వెళ్లాడని, అక్కడ పది కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారులో నగరానికి తిరిగి వస్తున్న క్రమంలో మధ్యలోనే దిగిపోయి మరో డ్రైవర్‌కు కారును అప్పగించాడని పేర్కొన్నారు. పలుమార్లు గంజాయిని నగరానికి తీసుకొచ్చి అల్వాల్, బోయిన్పల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయిని పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి. కమలహాసన్‌రెడ్డి, డీఎస్పీ భాస్కర్ అభినందించారు.
మహారాష్ట్రలో ఇద్దరు..
నగరంలోని పటాన్చెరులో పట్టుబడిన 220కిలోల గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు పాత నేరస్థులను పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. పటాన్చెరు ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఓ పరమేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం… మహారాష్ట్రకు చెందిన చంద్రకాంత్ నారాయణ, అమర్ సంజయ్ కావాల్, దిలీప్ అగాడ కలిసి ఒడిశా ఏఓబి నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, పలు ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలో ఒడిశా-ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల నుంచి డీసీఎం వ్యాన్‌లో 220కేజీల గంజాయిని హైదరాబాద్, పటాన్చెరు మీదుగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పటాన్చెరు ఎస్హెచ్ఓ పరమేశ్వర్‌గౌడ్ తన బృందంతో కలిసి గత ఏడాది మార్చి 1న ముత్తంగి టోల్గెట్ వద్ద నిందితుల వాహనాన్ని పట్టుకున్నారు.
అధికారుల రాకను ముందే గమనించిన ప్రధాన నిందితుడు దిలీప్ అగాడా, అతడి బావమరిది అమర్ సంజయ్ కావాల పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు. కాగా, వ్యాన్ డ్రైవర్ చంద్రకాంత్ నారాయణను అదేరోజు ఆబ్కారీ పోలీసులు అరెస్టు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఆబ్కారీ ఈడీ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు పటాన్చెరు ఎక్సైజ్ పోలీసుల బృందం మహారాష్ట్రలోని సతాజర్ జిల్లాకు వెళ్లి పరారీలో ఉన్న దిలీప్ అగాడా, అతడి బావమరిది అమర్ సంజయ్ కావాలను అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై ఆదివారం నగరానికి తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నగరంలో తప్పించుకుని మహారాష్ట్రలో తలదాచుకున్న నిందితులను అరెస్టు చేసి తీసుకువచ్చిన పటాన్చెరు ఎక్సైజ్ పోలీసు బృందాన్ని ఈడీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్చందర్ అభినందించారు.
– డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.లక్షల విలువ చేసే 9.28గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థం, సెల్‌ఫోన్‌తోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ మూసారాంబాగ్ ప్రాంతంలో గత కొంత కాలంగా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ బృందం మూసారాంబాగ్ ప్రాంతంలో సయ్యద్ అబ్దుల్ రెహమాన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్షల విలువ చేసే 9.28గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న వారిలో ఎస్టీఎఫ్ టీమ్-బి ఎస్ఐ బాలరాజు, యాదగిరి, ఆశిష్‌తో, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.