మన్సూరాబాద్, జూన్ 6: స్థల యజమానినంటూ ఓ వ్యక్తి వచ్చి.. సదరు భూమిలో పేరుకుపోయిన వ్యర్థాలపై డీజిల్ పోసి నిప్పు అంటించడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన మంగళవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్‌కాలనీలో సంభవించింది. కాలనీ అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పార్థసారథి కథనం ప్రకారం.. సహారాస్టేట్స్కాలనీలోని కాంప్లెక్స్ పక్కన ఉన్న సుమారు 3 వేల గజాల ఖాళీ స్థలాన్ని సహారా సంస్థ నుంచి ఆస్పత్రి నిర్మాణం కోసం కొన్ని సంవత్సరాల క్రితం సురేందర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. సదరు స్థలంలో సెల్లార్‌కు పై కప్పు వేసి వదిలారు. సదరు భూమిలో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని, వ్యర్థాలను కాల్చి వేసి భూమిని చదును చేసేందుకుగాను మంగళవారం ఉదయం 9:30 గంటలకు సురేందర్‌రెడ్డి కుమారుడినంటూ రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి కాలనీకి వచ్చాడు.
వ్యర్థాలను కాల్చవద్దని.. కావాలంటే అందులో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని ట్రాక్టర్ల ద్వార తొలగించుకోవాలని సూచించినప్పటికీ.. తన మనుషులతో స్థలం చుట్టూరా పాత టైర్లను వేసి డీజిల్ పోసి నిప్పు అంటించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని కాలనీ అధ్యక్షుడు తెలిపారు. భారీ మంటల వలన వెలువడిన పొగతో కాలనీవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వెంటనే విషయాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి తెలియజేయడంతో ఆయన వెంటనే ఫైర్ సిబ్బందిని, పోలీసులను కాలనీకి పంపారు. ఉదయం 9:45 గంటలకు మంటలు అంటుకోగా.. మధ్యాహ్నం 2 గంటలకు మం టలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదానికి కారణమైన రాజేందర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సహారాస్టేట్స్ మెయింటెనెన్స్ కమిటీ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యా దు చేశా రు. ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం జరుగలేదు.
అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
సహారాస్టేట్స్‌కాలనీలో సంభవించిన అగ్ని ప్రమాద ప్రాంతా న్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం విషయం తెలువగానే కాలనీకి రెండు ఫైర్ ఇంజన్లను పంపడం జరిగింద, జనావాసాల మధ్యన ఇలా మంటలను పెట్టి ఖాళీ స్థలాల్లోని వ్యర్థాలను కాల్చడం సరైంది కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కాలనీవాసులు చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.