Fire Accident | సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. భవనంలోని ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఎనిమిది మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. భవనంలో చిక్కుకుపోయిన వారికి రక్షించేందుకు అధికారులు భారీ క్రేన్‌ను తెప్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేపల్లే ఫార్మా, రసాయనల పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గాల్లోకి ఎగురుతూ భారీ శబ్దాలతో సాల్వెంట్స్ డ్రమ్స్ పేలుతున్నాయి. డ్రమ్ములు పేలుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కంపెనీకి దగ్గరలో ఉన్న జనప్రియ, మోదీ అపార్ట్మెంట్ల వాసులు ఆందోళన చెందుతున్నారు.