Car | శంషాబాద్ రూరల్, మే 11 : వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైన సంఘటన ఆదివారం శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన ఉస్మాన్ ప్రస్తుతం ఎల్బీనగర్లో నివాసముంటు ఆరునెలల క్రితం టీఎస్11యూబీ 7861 నంబర్‌గల టాటాజెట్ కారును కోనుగోలు చేసి డ్రైవర్ కం ఓనర్‌గా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు.
ఆదివారం నగరంలోని గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రయాణికులను తీసుకొని శంషాబాద్ మండలంలోని సమాతమూర్తి స్పూర్తి కేంద్రం నుంచి తిరిగి వెళ్తుండగా హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిలో తొండుపల్లి సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ ఉస్మాన్ ఇద్దరు ప్రయాణికులను కిందకు దింపి అతను దిగిపోయాడు. అనంతరం కారులో పూర్తిగా మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చేలోపు కారు పూర్తిగా దగ్ధమైందని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.