రామంతాపూర్,అక్టోబర్ 1 : నెల రోజుల క్రితం రామంతాపూర్‌లో కృష్ణాష్టమి సందర్భంగా విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు మృతి చెందారు.. ఈ ఘటనతో నగరంలో కేబుల్ వైర్లను ఇష్టానుసారంగా కట్ చేసి సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. అయితే అదే రామంతాపూర్‌లో బుధవారం మరో షార్ట్‌సర్క్యూట్ సంఘటన జరిగింది, ప్రాణ హాని లేకున్నా.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది..మద్యం బాటిళ్లను మద్యం దుకాణానికి తరలిస్తుండంతో ఒక్కసారి విద్యుత్ వైర్లుతాకి మంటలు చెలరేగిన ఘటన ఉప్పల్ పోలీస్టేషన్ పరిధిలోని హబ్సిగూడలో చోటు చేసుకుంది.
వివరాల్లో కెళితే.. ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి మద్యం లోడు చేసుకొని హబ్సిగూడ వీధి నెంబర్ 8 నుంచి డీసీఎం వ్యాన్(ఏపీ 29 వీ 4510) మద్యం దుకాణానికి వెళ్తుతుంది. మార్గ మధ్యలో స్ఫూర్తి డిగ్రీ కళాశాల వద్ద వ్యాన్ ఆగిపోయింది. వ్యాన్‌ను నెట్టుకుంటూ అక్కడున్న వారు ముందుకు తీసికెళ్లారు. రోడ్డుకు పక్కగా వెళ్తున్న డీసీఎం వ్యాన్‌కు పైన వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ జరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనంలో నుంచి కిందకు దిగాడు, వెంటనే డీసీఎంలో మంటలు చెలరేగాయి. మద్యం బాటిళ్లు ఉండడంతో వేగంగా డీసీఎంకు మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అవసరమైన చోట చర్యలు తీసుకొని సమస్యలను చక్కదిద్దాల్సిన విద్యుత్ శాఖ అధికారులు.. కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్‌లో చోటుచేసుకున్న ఘటన, ఆ తరువాత బండ్లగూడ, అంబర్‌పేట్‌లలో జరిగిన ఘటనలతో నగర వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను తొలగించారు. అయితే ప్రమాదకరంగా మారిన తమ విద్యుత్ వైర్లను మాత్రం చక్కదిద్దుకోవడాన్ని మరిచారా..? తమనెవరు అడుగుతారని ఆ విషయం పట్టించుకోలేదా? అనే విషయంపై ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆఘమేఘాల మీద ప్రభుత్వం హైదరాబాద్‌లో కేబుల్ వైర్లను తొలగించి సామాన్యులను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇంతా జరిగిన విద్యుత్ శాఖ మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడకుండా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయడాన్ని మరిచిపోవడంపై సామాన్య పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వచ్చిన డీసీఎం వ్యాన్ విద్యుత్ వైర్ల కింద ఆపడంతో టర్పాలిన్ విద్యుత్ వైర్లకు తాకి షార్ట్‌సర్క్యూట్ అయిందని ఏఈ లావణ్య తెలిపారు.