Hayathnagar | రంగారెడ్డి : హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రావి నారాయణరెడ్డి కాలనీ సమీపంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. కాలనీ సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెల్లో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. మంటలు వ్యాపించి ఇప్పటికే 30కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. కొన్ని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.