హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కాటేదాన్‌లోని ఒమర్ ట్రేడర్ ప్లాస్టిక్ వేస్టేజ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తానికి విస్తరించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. అయితే ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కంపెనీలో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమను నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.