హైదరాబాద్: హైదరాబాద్లో రెండు భారీ అగ్నిప్రమాదాలు (Fire Accidents) జరిగాయి. ఓల్డ్ సిటీలోని ఓ స్క్రాప్ గోదాంలో, సికింద్రాబాద్లోని మోండా మార్కెల్లో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. గురువారం తెల్లవారుజామున మోండా మార్కెట్లోని ఓ పూజా స్టోర్లో మంటలు దట్టంగా వ్యాపించాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న నాలుగు దుకాణాలకు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. అయితే భారీగా మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పాతబస్తీలో..
పాతబస్తీలోని ఐఎస్ సదన్ పీఎస్ పరిధిలో ఉన్న మాదన్నపేట చౌరస్తాలో ఓ స్క్రాప్ గోదాంలో మంటలు అంటుకున్నాయి. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి పోలీసులు చేసుకున్నారు. ఆరు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గోదాంలోని వస్తువులు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.