Fire Accident | జీడిమెట్ల ఎస్ఎస్వీ ఫ్యాబ్ ఇండస్ట్రీస్ పాలిథిన్ సంచుల తయారీ కంపెనీలో మంగళవారం భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పరిశ్రమలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అర్ధరాత్రి వరకు అదుపులోకి తీసుకువచ్చారు. కంపెనీలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. భవనంలోని మూడో అంతస్తులో మంటలు చేరగా.. క్రమంగా ఒకటో అంతస్తు వరకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత భవనం మొత్తం మంటలు చెలరేగాయి. మంటల సమయంలో ఫ్యాక్టరీలోని కెమికల్ డ్రమ్ములు పెద్ద ఎత్తున నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో ఆ డమ్ములన్నీ పేలడంతో మంటలు మరింత చెలరేగాయి. ఫలితంగా మంటలను ఆర్పివేయడం అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది.
భారీగా చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ కమ్మేసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి నగరంలోని పలుచోట్ల నుంచి ఏడు ఫైరింజన్లను తరలించారు. అలాగే, వాటర్ బోర్డుతో పాటు ప్రైవేటు ట్యాంకర్లతో నీటిని తరలించారు. ఒక దశలో మంటలు వంద మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. దాంతో పాటు 200 మీటర్ల వరకు వేడిసెగలు వచ్చాయి. రసాయన డ్రమ్ముల పేలుడుతో మంటలు భారీగా ఎగిసిపడగా.. మంటలను అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. మంటల ధాటికి భవనం గోడలు బీటలు వారి కూలిపోయింది. ప్రమాదంలో దాదాపు రూ.100కోట్లకుపైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలు వంద మందికిపైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం నేపథ్యంలో కార్మికులంతా బయటకు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.