చర్లపల్లి, నవంబర్ 13 : ఫ్లైవుడ్, హార్డ్‌వేర్ ఫర్నిచర్ షాప్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాప్రా సర్కిల్, హెచ్‌బీకాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ ప్రధాన రహదారిలో శ్రీ సాయి రోహిత్ మార్కెటింగ్ పేరుతో అల్యూమినియం, ఫైవుడ్, హార్డ్‌వేర్ దుకాణంను లక్ష్మణ్‌కుమార్ నడిపిస్తున్నాడు.
కాగా బుధవారం రాత్రి దుకాణంను మూసివేసి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత షాప్‌లో మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, దుకాణం యజమాని లక్ష్మణ్‌కుమార్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే మంటలు పూర్తిగా అంటుకోవడంతో పలు వస్తువులు కాలి బూడిదయ్యాయి. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపుల్లోకి తీసుకురావడంతో పెద్ద ప్రమా దం తప్పింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్కూట్ కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికి.. ఆస్తి నష్టం ఎంత జరిగిందో తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దరార్యప్తు చేస్తున్నారు.