హిమాయత్‌నగర్, నవంబర్ 1: అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్ వీధి నం. 18లో ఉన్న కీర్తి శిఖర అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని 403 ఫ్లాట్‌లో న్యాయవాది చంద్రశేఖర్ తన కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం రాత్రి పూజ గదిలో దీపం పెట్టి బర్కత్‌పురలో తన కార్యాలయంలో పూజలు చేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు.
వారు వెళ్లిన కొద్దిసేపట్టికే ఆ ఫ్లాట్‌లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్లాట్‌లో దట్టమైన పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. పక్క ఫ్లాట్‌లో నివాసముండే వారు మంటలను గమనించి.. లోపలి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఎస్ఐ షపీ ఘటన స్థలానికి చేరుకుని అగ్ని మాపక సిబ్బందిని పిలిపించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే ఫ్లాట్‌లో ఉన్న విలువైన ఫర్నిచర్, సామగ్రి, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరుగక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.