అబిడ్స్ మే 18: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గుల్జార్ హౌస్ లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా 17 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ హైదరాబాద్ సౌత్ జిల్లా ప్రతినిధి బృందం తో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కృష్ణ జ్యువెల్లరీ దుకాణ నివాసం లో ఘటన జరిగిన వెంటనే అత్యాధునిక ఎమర్జెన్సీ సౌకర్యాలు కలిగిన సామగ్రితో సిబ్బంది సకాలంలో వచ్చి ఉంటే ఈ ఘటన లో ఇన్ని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది కాదని అన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫైరింజన్లు,అంబులెన్సు లు రాకపోవడం వల్ల ఇంతమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ జనసాంద్రత ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం లోని వ్యాపార ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ అధికారులు సరైన అవగాహన కలిగించకపోవడం ఈ దుర్ఘటన జరిగిందన్నారు. సీపీఎం హైదరాబాద్ సౌత్ జిల్లా నేతలు మీనా, విఠల్, నాగేశ్వర్, కిషన్, జం గయ్య, కృష్ణ, బాబర్ ఖాన్, రాంకుమార్, యాకూబ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.