Fire Accident | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉద్దమ్మగడ్డలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ మూడంతస్తుల భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఆ భవనంలో ఉంటున్న నివాసితులు తీవ్ర భయాందోళనకు గురై, భవనంపైకి ఎక్కారు.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నివాసితులను సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. మొత్తం 50 మందిని ప్రాణాలతో కాపాడినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 15 ఏండ్ల లోపు వారు 16 మంది ఉన్నారు. మంటలను అదుపు చేసేందుకు గంటన్నర పాటు తీవ్రంగా శ్రమించారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆదివారం తెల్లవారుజామున మీర్‌చౌక్‌లోని గుల్జార్‌హౌస్‌లో (Gulzar House) భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో 17 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. గాయపడినవారిని మలక్‌పేట యశోద, హైదర్‌గూడ అపోలో, డీఆర్డీఎల్ అపోలో, ఉస్మానియా, నాంపల్లి కేర్ హాస్పిటళ్లకు తరలించారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా, మిగిలినవారు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.