సిటీబ్యూరో, మార్చి18 (నమస్తే తెలంగాణ): నిత్యం పేద ప్రజల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తున్న ఆశవర్కర్ల జీవితాలు అంధకారంలోకి చేరాయి. అధికారంలోకి రాగానే ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కేస్తుంది. హైదరాబాద్‌లో ఉన్న సుమారు 1650 మంది ఆశవర్కర్లు నిత్యం ప్రజల్లో ఉంటూ ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పలు ఆరోగ్య సర్వేలు చేస్తున్నారు. ఎన్సీడీ, క్షయ, ఫైలేరియా, ఫీవర్ వంటి సర్వేల్లో పాల్గొంటు టార్గెట్లను అధిగమించి పనిచేస్తున్నారు.
ఈ సర్వేలకు గాను ప్రభుత్వం పారితోషికం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు సర్వేలు ఎన్ని చేసినా ఆశలకు డబ్బులు ఇవ్వని పరిస్థితి నెలకొంది. సర్వేలతోపాటు సెంటర్లలో విధులు నిర్వహించే వాళ్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటుంది. మరోవైపు జిల్లాలో 128 ఏఎన్ఎం పోస్టులు ఖాళీలు ఉండటంతో సిబ్బంది కొరత ఉన్న సెంటర్లలో ఏఎన్ఎంలు చేయాల్సిన ఎంసీహెచ్, ఎన్సీడీ వివరాలు ఆన్లైన్ ఎక్కించే పనిని కూడా ఆశలే చేస్తుండటం గమనార్హం. పనిభారంతో అనారోగ్య సమస్యలకు గురవుతూ, ఉద్యోగాలు వదిలే పరిస్థితి నెలకొంది.
తగ్గిన డెలివరీ నమోదులు..
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ వల్ల అనేక మంది పేదలు ప్రసవాల కోసం ప్రభుత్వ దవాఖానల్లో చేరేవారు. ఆశ వర్కర్లతో వారి పేరు నమోదు చేయించుకునేవారు. డెలివరీ సమయంలో కూడా పేరు నమోదు చేసుకొని వారికి కేసీఆర్ కిట్ అందించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కిట్‌కు బదులు ఎంసీహెచ్ కిట్ గా పేరు మార్చి ఇవ్వడమే మానేసింది. దీంతో గర్భిణులు ఆశవరర్ల వద్దకు రావడమే మానేశారు. అధికారులు ఇవేవి పట్టించుకోకుండా తప్పనిసరిగా ఒక ఆశా వర్కర్ నెలలో ఐదుగురు గర్భిణులను ఆన్లైన్లో నమోదు చేయాలని, అది కూడా 12 వారాల వారిని మాత్రమే నమోదు చేయాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు. డెలివరీ కేసుల నమోదు ఆధారంగా రివ్యూస్ ఇచ్చి వేతనాలు ఇస్తుండటం గమనార్హం. కేసీఆర్ కిట్లేకపోవడం, ప్రస్తుతమున్న కిట్ అమలు చేయకపోవడంతో డెలివరీ కేసుల నమోదు తగ్గుదల ఏర్పడటం వల్ల ఆశవర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే ఆశల వేతనాలు పెంచి, వారికి ఆర్థిక భరోసానిచ్చింది.
గుర్తింపు ఇస్తలేరు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో ఆశ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నాటి వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షలు నిర్వహించి మా సాధకబాధకాలు తెలుసుకునేవారు. ప్రస్తుతం ఆపత్రులకు వెళ్తే కనీస గుర్తింపు ఇవ్వకుండా చూస్తున్నారు.
– రావుల సంతోష, బీఆర్టీయూ సంఘం ఆశవర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు
హామీలు మరిచారు
హైదరాబాద్ జిల్లాలో పనిచేసే ఆశలపై అధిక పనిభారం పడుతుంది. సర్వేలు చేయించుకుంటున్నారు డబ్బులు ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ప్రభుత్వం విస్మరించింది. మా సొంత డబ్బులతో పలుసార్లు ఆసుత్రులకు పేషెంట్లను తీసుకెళ్తున్నాం.
– యాదమ్మ, సీఐటీయూ సంఘం ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు