Cyber Fraud | బంజారాహిల్స్, ఏప్రిల్ 13: ఆన్లైన్లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని నమ్మి ఓ సినీ రచయిత సైబర్ మోసానికి గురయ్యాడు. ఫేస్బుక్లో వచ్చిన వీడియో చూసి దాదాపు 40 వేల వరకు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ యూసుఫ్‌గూడ సమీపంలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటున్న శనివారపు జనార్దన్ రెడ్డి సినీ రచయితగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఫేస్బుక్ చూస్తున్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్న ఒక వీడియో అతడిని ఆకర్షించింది. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా మంచి లాభాలు వస్తాయంటూ జీపీటీ ఆడిపెక్స్ అనే యాప్ గురించి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అమెరికా డాలర్లు పెట్టుబడి పెడితే రెండు వారాల్లో లాభాలు వస్తాయని మరో లింక్‌లో చెప్పారు.
ఆ వీడియో చూసిన జనార్దన్ రెడ్డి.. అది నిజమేనని అనుకుని తన భార్య పేరుతో 430 డాలర్లు పెట్టుబడి పెట్టాడు. అయితే కొంతసేపు తర్వాత మరిన్ని డాలర్లు పెట్టుబడి పెట్టాలని రావడంతో అనుమానం వచ్చి వాకబు చేయగా.. తాను చూసిన వీడియో ఫేక్ అని తేలింది. ఇదంతా సైబర్ మోసగాళ్ల పని అని గుర్తించిన బాధితుడు జనార్దన్ రెడ్డి సైబర్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రూ.39,694 మేర మోసం జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.