మల్కాజిగిరి, ఫిబ్రవరి 8: తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణన తప్పుల తడకగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిందని సినీ నిర్మాత రాజు అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ ఆనంద్ బాగ్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం నిర్వహించిన బీసీ కుల గణనకు వ్యతిరేకంగా తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉదయం గంటలకు ఆనంద్ బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నిర్మాత టి.రాజు హాజరై మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే తప్పుల తడకగా ఉందని బీసీ వర్గాలను తక్కువ చేసి చూపారని ఆరోపించారు. సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలన్నింటిలో వివక్షకు నిర్లక్ష్యానికి గురైన బీసీలంతా సంఘటితమై రాజ్యాధికారంలో న్యాయమైన వాటా సాధించేందుకు పాలకులపై సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి కామళ్ల ఐలన్న అధ్యక్షత వహించి మాట్లాడారు.
రాష్ట్రంలో అధిక సంఖ్యలో బీసీ జనాభా ఉన్నప్పటికీ అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, విద్య, ఉపాధి రాజకీయ తదితర రంగాల్లో ఎదగ లేకపోతున్నామన్నారు. లెక్కించాల్సింది బీసీలను కాదని ఓసీలనని ఓసీ జనాభా ఎంత ఉంటే రిజర్వేషన్లు అంత కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జీనుకుంట్ల రమేశ్ గౌడ్, కార్యదర్శిలు చేకూరి రామ్మోహన్, కాసర్ల నాగరాజు, ఉడుత నవీన్, జోగు శ్రీనివాస్, బి దశరథ్, సీహెచ్ వెంకటయ్య, పిట్టల భాస్కర్ భాగ్యలక్ష్మి పేపర్ శ్రీను సంతోష్ కుమార్ కుమ్మరి రాజు, బాలచందర్ గౌడ్, పి సత్యనారాయణ రజక సంపత్ రజక తదితరులు పాల్గొన్నారు. అనంతరం, మూడు గంటలకు, బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు వీకే మహేశ్ దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరవింపజేశారు.