మాయదారి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నాలుగైదురోజులుగా కేసులు పెరుగుతుండటంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఉధృతిని కట్టడి చేసేందుకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 337 జ్వర కేంద్రాల (ఫీవర్ క్లినిక్లు)ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నగర పరిధిలో బస్తీ దవాఖానలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్సీలు)లో శుక్రవారం వీటిని ప్రారంభించి సేవలు అందించారు. జ్వరం, జలుబు, దగ్గుతోపాటు కరోనా స్వల్ప లక్షణాలున్న వారికి ఈ కేంద్రాల్లో చికిత్స అందిస్తారు. అవసరమైతే వెంటనే యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ వచ్చిన వారితోపాటు లక్షణాలున్న వారికి ఐసొలేషన్ కిట్లను వెంటనే అందజేస్తారు. గ్రేటర్ వ్యాప్తంగా తొలిరోజు ఈ క్లినిక్లలో 24,423 మందికి ఓపీ సేవలు అందించారు. కాగా, శుక్రవారం గ్రేటర్ పరిధిలో 1452 కరోనా కేసులు నమోదయ్యాయి.
సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్లను ప్రారంభించింది. శుక్రవారం 337 కేంద్రాల్లో ఈ సేవలను ప్రారంభించారు. పీహెచ్సీలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), యూపీహెచ్సీలు (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు)లలో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ గ్రేటర్ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో 150 బస్తీ దవాఖానల్లో ఫీవర్ క్లినిక్లను అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. తొలిరోజు గ్రేటర్ వ్యాప్తంగా 24,423మందికి ఓపీ సేవలందించారు. వారిలో 3,132మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారికి కరోనా కిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఫీవర్ క్లినిక్లలో ప్రత్యేకంగా జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి కరోనా లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా చికిత్స చేస్తారని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. లక్షణాలున్నవారికి యాంటిజన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో నెగిటివ్ వచ్చినప్పటికీ రోగికి లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పాజిటివ్ వచ్చిన వారితో పాటు లక్షణాలున్న వారికి కరోనా ఐసొలేషన్ కిట్లను అక్కడికక్కడే అందజేస్తున్నట్లు తెలిపారు.