రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రుల నివాసాల్లోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కాన్వాయ్ అక్కడకు రావడంతో విద్యార్థులు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. మంత్రి కారుకు అడ్డుగా నిలబడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళన కారులను పక్కకు లాగేయడంతో పాటు అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
– బంజారాహిల్స్,జూన్ 6