చార్మినార్, జూలై 13: పాత బస్తీవాసుల తీర్థయాత్ర విషాదంగా మారింది. ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా పలు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. మృతులు, క్షతగాత్రులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఏ ఇంట్లో చూసినా రోదనలు మిన్నంటాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పాతబస్తీలోని చత్రినాక ఠాణా పరిధిలోని దానయ్య నగర్‌కు చెందిన ఉదయ్‌సింగ్ (65) వృత్తిరీత్య డ్రైవర్. అంతే కాకుండా ప్రతి సంవత్సరం స్వయంగా డ్రైవింగ్ చేస్తూ నార్త్ ఇండియాలోని పలు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్ర నిర్వహిస్తాడు. దీంతో స్థానికులు చాలా మంది ఉదయ్‌సింగ్ వెంట యాత్రకు వెళ్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ నెల 8న స్థానికులతో కలిసి ఉదయ్‌సింగ్ ప్రైవేటు బస్సులో తీర్థయాత్రకు బయలుదేరాడు. అందులో భాగంగా చత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని కందికల్ గేట్, అరుంధతి కాలనీ ప్రాంతాలకు చెందిన 30 మందికి పైగా తీర్థయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా జోగులాంబ, విజయవాడ కనకదుర్గా అమ్మవారితోపాటు పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ నార్త్ ఇండియా తీర్థయాత్రలకు బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం పూరీ జగన్నాథ దేవాలయాన్ని సందర్శించుకున్న యాత్రికుల బృందం గయా తీర్థయాత్రకు ప్రయాణమయ్యారు. కాగా శనివారం తెల్లవారు జామున గయాకు చేరుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వారి బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు నడుపుతున్న ఉదయ్‌సింగ్, అతడి సోదరి క్రాంతిభాయ్(54)తోపాటు అదనపు డ్రైవర్ ఉప్పలయ్య(70) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 30మంది యాత్రికుల్లో పలువురు తీవ్రగాయాలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న దవాఖానకు తరలించారు. మృతి చెందిన ఉదయ్‌సింగ్, క్రాంతిబాయ్, ఉప్పలయ్య మృతదేహాలను స్థానికంగా ఉన్న ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం నింపిన తీర్థయాత్ర ..
తీర్థయాత్రలు చేపట్టే ఉదయ్‌సింగ్, క్రాంతిభాయ్ అన్నాచెల్లెళ్లు. నివాసం కూడా పాతబస్తీలోని దానయ్య నగర్లో అన్నాచెల్లెలు పక్కపక్క ఇళ్లలోనే నివాసం ఉంటారు. యాత్ర సమయంలో సైతం తన అన్నతో పాటు డ్రైవింగ్ క్యాబిన్‌లోనే ఆమె కూర్చున్నది. ఈ క్రమంలోనే దుర్ఘటన జరిగిన సమయంలో కూడా ఉదయ్‌సింగ్ బస్సు నడుపుతుండగా క్రాంతిభాయ్, అదనపు డ్రైవర్ ఉప్పలయ్య డ్రైవింగ్ క్యాబిన్లో కూర్చొని ఉన్నట్లు యాత్రికుల బంధువులు తెలిపారు.
అయితే ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో బస్సు నడుపుతున్న ఉదయ్‌సింగ్‌తో పాటు డ్రైవింగ్ క్యాబిన్లో ఉన్న ఆయన సోదరి క్రాంతిభాయ్, అదనపు డ్రైవర్ ఉప్పలయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆప్యాయంగా పలకరించే అన్నా చెల్లెలైన క్రాంతిభాయ్, ఉదయ్‌సింగ్‌లు మృతి చెందిన విషయం తెలియడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్నాచెల్లెలు.. మరణంలోనూ కలిసి వెళ్లారంటూ వారు కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగువారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులను, తోటి యాత్రికులను నగరానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు విజ్ఞప్తి చేశారు.