సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గతంలో రేవ్ పార్టీలకు స్థావరంగా ఉన్న ఆయా ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లలో నేటికి గుట్టుచప్పుడు కాకుండా అన్నిరకాల ఈవెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీటిల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నిర్వాహకులు ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకున్నా ఈవెంట్లకు ఫామ్‌హౌస్, రిసార్ట్స్‌లను అద్దెకు ఇస్తున్నారు. ఆబ్కారీ శాఖ అనుమతి లేనిదే మద్యం వినియోగం ఉండే ఈవెంట్‌కు అంగీకరించకూడదు. పోలీసు శాఖ అనుమతి లేనిదే డీజేకు అనుమతించకూడదు. ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
మంగ్లీ ఘటనతో రిసార్ట్స్, ఫామ్‌హౌస్ నిర్వాహకుల కక్కుర్తి బయటపడింది. ఈ ఘటనలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం వినియోగానికి సదరు రిసార్ట్స్ నిర్వాహకులు అనుమతివ్వడం గమనార్హం. వాస్తవానికి ఏదైనా ఈవెంట్‌కు రిసార్ట్స్ లేదా ఫామ్‌హౌస్‌లను అద్దెకి ఇచ్చే సమయంలో ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యాజమాన్యం తెలుసుకోవాలి. ఈవెంట్లో మద్యం వినియోగం, డీజే, వంటివి వినియోగిస్తున్నారా లేదా అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకవేల మద్యం, డీజే వంటివి వినియోగిస్తే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి పత్రాన్ని కోరాలి. పోలీసు, ఆబ్కారీ శాఖల అనుమతి ఉంటేనే మద్యం వినియోగానికి, డీజే తదితరాల వినియోగానికి అంగీకరించాలి. నిర్వాహకులు ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకున్నా ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లను ఇష్టానుసారంగా అద్దెకు ఇస్తున్నారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుమారు 100కి పైగా ఫామ్‌హౌస్‌లు, 50కి పైగా రిసార్ట్స్‌లు ఉన్నాయి. వీటిల్లో ప్రతి రోజు ఎక్కడో కొన్ని చోట్ల రకరకాల ఈవెంట్లు లేదా పార్టీలు జరుగుతుంటాయి. ఒక వారాంతరాల్లో అయితే దాదాపు అన్ని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్ హౌస్‌ఫుల్‌గా ఉంటాయి. అయితే ఎక్కడా ఎలాంటి పార్టీలు, ఈవెంట్లు జరుగుతున్నాయో సరైన స్పష్టత ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది నిర్వాహకులు స్థానిక పోలీసులకు నెలవారి ముడుపులు చెల్లిస్తుండటంతో వారు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఏదైనా రాజకీయ కోణంలో వచ్చే ఫిర్యాదులు లేక పై స్థాయిలో వచ్చే ఫిర్యాదులతో మాత్రమే పోలీసులు హడావిడి చేస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో జరిపే దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు దొరికితే దొంగలుగా, దొరక్కపోతే దొరల్లా మిగిలిపోతున్నారనే వాదలు వినిపిస్తున్నాయి.
పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ముడుపుల కోసం వేధిస్తున్నారని పలువురు ఫామ్‌హౌస్, రిసార్ట్స్‌ల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈవెంట్లు జరిగినా, జరగకపోయినా వారికి మాత్రం నెలవారి ముడుపులు చెల్లించుకోవాల్సిందే అని లేకపోతే చట్టాల పేరుతో రకరకాలుగా వేధిస్తారని కొందరు నిర్వాహకులు వాపోతున్నారు. ముడుపులు చెల్లించిన వారికి ఎలాంటి నిబంధనలు ఉండవని ఆయా ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లలో అన్ని రకాల ఈవెంట్లు యథేచ్ఛగా సాగుతున్నట్లు కొందరు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అయితే తమ ఫామ్‌హౌస్, రిసార్ట్స్‌ల నిర్వహణ ఖర్చులతో పాటు ఆయా అధికారులు ముడుపుల ఖర్చు కోసం తాము ఎలాంటి అనుమతులు లేకున్నా ఈవెంట్ల నిర్వహణకు అంగీకరిస్తున్నట్లు పలువురు నిర్వాహకులు చెబుతున్నారు.