‘కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో అరిగోసపడ్డాం. ఏనాడూ కంటి నిండా నిద్రపోలే. అప్పట్లో వ్యవసాయం చేసుకోవాలంటేనే భయమయ్యేది. ఇప్పుడు మూడు గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెసోళ్లు చెబుతున్నారు. మూడు గంటల కరెంటుతో నారుమడి కూడా పారదు. ఇక 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నారు. అవి పెడితే బోర్లు ఎండిపోతాయి. ఇప్పుడు 24 గంటల కరెంటుతో పంటలు మంచిగా పండుతున్నాయి’ అని రైతన్నలు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు ఉన్న ధరణి తీసేసి అధికారుల కడుపు నింపే భూమాత తెస్తామంటూ రైతులను భయపెడుతున్నారని మండిపడుతున్నారు. ధరణితో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి.. కోరి కష్టాలు తెచ్చుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరంటున్నారు. భూమాత వద్దు.. మూడు గంటల కరెంటువద్దు.. అసలు కాంగ్రెస్సే వద్దే వద్దంటున్నారు. నాడు అరిగోస పెట్టి.. ఇప్పుడు మళ్లీ వస్తున్న కాంగ్రెస్కుబుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు. రైతులను రాజులను చేసిన బీఆర్ఎస్నే గెలిపించుకుంటామంటున్నారు.
కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంటిస్తామని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నారు. 10 హెచ్‌పీ మోటర్ కొనాలంటే సుమారు లక్ష ఖర్చవుతుంది. అంత డబ్బు పెట్టి కొనే స్తోమత వ్యవసాయం చేసుకునే రైతులకు ఉండదు. రైతులందరూ ఒకేసారి మోటర్లు ఆన్ చేస్తే లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు వల్ల ప్రస్తుతం ఉన్న 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లతో పంట సాగు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం.
– వెంకట్‌రెడ్డి, రైతు, బండమాదాదం
కాంగ్రెస్ పాలనలో అరకొర కరెంట్‌తో పంటలు ఎండిపోయి ఇబ్బంది పడ్డాం. కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు చీకట్లో పొలం వద్దకు పోయి బోరు ఆన్‌చేసి వస్తుండేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం చేసుకోవడానికి రైతులకు ఉచితంగా 24 గంటల పాటు ఇస్తున్న కరెంట్‌తో ఎవుసం సంతోషంగా చేసుకుంటున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలం వెల్లదీస్తున్నాం. ఒకప్పటి బీడు భూములు కూడా ఇప్పుడు సాగు భూములుగా మారాయి. అందుకే మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించుకుంటాం.
– సత్యనారాయణ, రైతు, సోమారం గ్రామం
కాంగ్రెస్ రాజ్యమంటేనే కరెంటు, నీళ్ల బాధలు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు అంటున్న మాటలు రైతాంగానికి పూర్తిగా వ్యతిరేకం. 3 గంటల కరెంటు అంటే కష్టాలను కొని తెచ్చుకున్నట్టే. మూడు గంటల కరెంటు అంటే పొలం పారవెట్టనీకి 10 హెచ్‌పీ మోటర్ పెట్టాల్సిందే. పెద్దమోటర్ పెడితే లోవోల్టేజీ సమస్య వస్తుంది. నీళ్లు లేక బోరు మోటర్ కాలిపోతుంది. ఇట్ల మూడు గంటలతోటి రైతుకు అన్ని కష్టాలే. అన్నదాత ఎప్పుడైనా 24 గంటల కరెంటు కోరుకుంటడు. 3 గంటలు అంటే కాంగ్రెస్‌ను తరిమికొట్టక తప్పదు.
– మాదిరెడ్డి యాదరెడ్డి, రైతు, బాబాగూడ
3గంటల కరెంట్‌తో ఎవుసం సాగదు. మొత్తం పొలానికి తడి అందదు. సీఎం కేసీఆర్ వచ్చినంకనే కరెంట్ మంచిగా వస్తున్నది. మోటర్లు కాలిపోవడం లేదు. పంటలు ఎండిపోవడం లేదు. సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే రైతులు సంతోషంగా సాగు చేసుకుంటున్నారు. పొరపాటున కాంగ్రెస్ వచ్చిందంటే.. రైతుల బతుకులు ఆగమవుతాయి. 10 హెచ్‌పీ మోటరు పెట్టుకోవాలంటే రైతులకు ఆర్థిక భారమే.అయినా కాంగ్రెస్ వచ్చేదిలేదు. అన్నదాతలకు మేలు చేస్తున్న బీఆర్ఎస్నే మళ్లీ గెలిపించుకుంటాం.
-బాయికాడి సత్తిరెడ్డి, గౌడవెల్లి, మేడ్చల్ జిల్లా
ఇప్పుడున్న 24 గంటల కరెంటుతో రైతులు సంతోషంగా ఉన్నారు. మూడు గంటల కరెంటుతో వ్యవసాయం భారంగా మారుతుంది. రైతుల కష్టాలు తెలిసిన ఎవరూ మూడు గంటల కరెంటు ముచ్చట మాట్లాడరు. ఎందుకంటే ఆ మూడు గంటల కష్టాలను గతంలోనే చూసినం. రాత్రి పగలు తేడా లేకపాయే. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంటుతోటి రైతులు నిమ్మలంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా ఇవన్నీ ఇస్తున్నారు.
– నర్ర పాపిరెడ్డి, బొమ్మరాశిపేట
కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ ఇస్తే రైతు వ్యవసాయం పక్కన పెట్టాల్సిందే. వరిసాగు పడిపోవడంతో పాటు మెట్ట పంటలు కూడా వేసుకోలేం. మూడు గంటల కరెంటుతో పొలం మొత్తం పారదు. ప్రతి రైతు ఇంకో బోరు వేసుకోవాల్సిందే. పంటకు అయ్యే పెట్టుబడికంటే మోటర్లు, వైర్లు కొనేందుకు ఎక్కువ డబ్బులవుతాయి. పదేండ్ల కింద ఎప్పుడొస్తుందో తెలియని కరెంట్ కోసం జాగారం చేసినం. మళ్లీ అవే కష్టాలు కోరి తెచ్చుకుంటామా. కాంగ్రెస్ చెప్పింది నమ్మి ఓటేస్తే కూలీలుగా, వలస కార్మికులుగా మారాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే గౌరవంగా బతుకుతున్నాం.
– శేషారెడ్డి, గాగిల్లాపూర్
రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోగొప్ప పథకాలు తీసుకొచ్చింది. అందులో రైతుబంధుతో పెట్టుబడి సాయం అందుతుంటే ధరణితో భూములు సురక్షితంగా ఉంటున్నాయి. కాంగ్రెస్ పాలనలో భూముల గొడవలు, హద్దుల సమస్యలు ఎక్కువగా ఉండేవి. బీఆర్ఎస్ పాలనలో రిజిస్ట్రేషన్, బదలాయింపు, పాసుబుక్కు పనులు అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తామంటున్నారు. అట్లాయితె భూములకు రక్షణ లేకుండా పోతుంది. రైతులకు మరింత సాయం అందాలంటే బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి.
– ఎండీ షరీఫ్, దుండిగల్, మేడ్చల్ జిల్లా
పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతులను మోసం చేస్తుంది. 3 గంటల కరెంట్‌తో మళ్లీ పాత రోజుల వచ్చే ప్రమాదం లేకపోలేదు. మూడు గంటలు కరెంట్ ఇస్తే రైతులు సాగు చేసిన పంటలన్నీ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు కరెంట్ లేకపోతే అన్నదాతలు ఆగం కావాల్సిందే. రైతాంగానికి 3 గంటల కరెంట్ అసలే సరిపోదు. కరెంట్ విషయంలో రైతులు ఇబ్బందులు పడాల్సిందే. 24 గంటల కరెంటు ఉండాలంటే.. రైతు కష్టం తెలిసిన కేసీఆరే మళ్లీ అధికారంలోకి రావాలి.
– వంటల చంద్రశేఖర్‌యాదవ్, రైతు, కీసర
మూడు గంటలు కరెంట్ అని చెప్పిన కాంగ్రెస్ పొరపాటున అధికారంలోకి వస్తే ఆతర్వాత మోటర్లకు మీటర్లు పెడతారు. ఏ పనిచేయాలన్నా పదిమందిని కలిసి పైరవీ చేయాల్సి వస్తుంది. అప్పట్లో లోవోల్టేజీ, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతుండే. పొలంలో నీళ్లు పారుడు ఏమోగానీ రాత్రి కరెంట్ ఎప్పుడొస్తదో తెల్వక జాగారం ఉంటుండే. బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు చెరువులన్నీ నిండుగా ఉంటున్నాయి. భూగర్భ జలాలు పెరగడంతో కోరుకున్నప్పుడు బోరు వేసి నీరు పెడుతున్నాం. మరోసారి బీఆర్ఎస్ సర్కారే రావాలి. మళ్లీ కేసీఆరే సీఎం కావాలి.
-వీరేశం, డి.పోచంపల్లి, మేడ్చల్ జిల్లా
గతంలో కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరిగ్గా లేకపోవడంతో చాలా మంది రైతులు నానా అవస్థలు పడ్డారు. కరెంటు వచ్చి పోవడంతో మోటర్లు కూడా పూర్తిగా కాలిపోయేవి. మళ్లీ రైతులకు ఇబ్బందులను గురిచేయడానికి కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్లు అంటున్నారు. కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెప్పి.. రైతులకు నష్టం చేయడానికి పన్నగాలు పన్నుతున్నది. కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ యావత్ రైతాంగం అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నామని అంటున్నారు.
– గండు శ్రీకాంత్‌యాదవ్, రైతు, కీసరదాయర