చిక్కడపల్లి, సెప్టెంబర్ 26: పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సంఘం, టి.జి. విజయ డెయిరీ పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు వివిధ జిల్లాల నుంచి పాడి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. పాడి రైతులకు ఐదు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉన్నదని తెలిపారు. పాడి సంరక్షణ మందులు, గడ్డి విత్తనాలు 50 శాతం సబ్సిడీపై ఇవ్వాలన్నారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.150 కోట్లకు కేవలం ప్రభుత్వం రూ. 50 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాడి రైతులకు కూడా రైతు బీమా సధుపాయం కల్పించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
రైతుల ఇంటి వద్దకే పశువైద్య సౌకర్యాన్ని మొబైల్ వ్యాన్ల ద్వారా అందించాలన్నారు. పాడి రైతుల పిల్లల చదువులకు స్కాలర్ షిప్ ఇవ్వాలని కోరారు. పశుసంవర్థక శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. లీటర్‌కు ఐదు రూపాయల ప్రోత్సాహకాన్ని ఎన్నికల హామీ మేరకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాడి రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తామని తెలిపారు. మంగం నర్సింహ, సాదం రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, మూడు శోభన్ , ఉప్పలయ్య , వీరమల్లు, రాజయ్య, జి.వెంకటేశ్, ఉత్తమ్, రమేశ్, కృష్ణ, రాఘవ తదితరులు పాల్గొన్నారు.