Runa Mafi | మేడ్చల్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుతీస్తున్నది. అటు రుణమాఫీ చేయకుండా..ఇటు రైతు భరోసా ఇవ్వకుండా అన్నదాతల ఆత్మహత్యలకు సర్కారే కారణమవుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌కు చెందిన రైతు సోలిపేట సురేందర్‌రెడ్డి(55) మేడ్చల్‌లోని వ్యవసాయశాఖ కార్యాలయం సమీపంలో ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసింది.
రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న సురేందర్‌రెడ్డి తీసుకున్న లక్షా 92 వేల పంట రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు రైతులు పేర్కొంటున్నారు. అర్హులైన వారికీ రుణమాఫీ చేయకుండా ఇంకెంతమంది అన్నదాతల ఉసురుతీస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రుణమాఫీపై ఇప్పుడు ఆంక్షలు ఎందుకు పెడుతున్నదని మండిపడుతున్నారు.
రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. కాగా, మేడ్చల్ జిల్లాలో 30 వేల పైచిలుకు రైతులు పంట రుణాలు తీసుకున్నారని, అయితే కేవలం 3,442 మందికే రుణమాఫీ చేశారని అన్నదాతలు అన్నారు. రుణమాఫీ అందని వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు చేసినా..లభం లేకుండాపోయిందన్నారు.
మేడ్చల్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు సురేందర్‌రెడ్డి కుటుంబసభ్యులను మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పరామర్శించారు. సురేందర్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమంటూ.. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.