Fourth City | కందుకూరు: బలవంతంగా తమ భూ ములను సర్వే చేయవద్దని, తక్షణమే నిలిపివేయాలని అధికారులను రైతులు వేడుకున్నారు. ‘ఫోర్త్ సిటీకి రోడ్డును ఏర్పాటు చేయడానికి మా భూములు దొరికాయా’ అంటూ అధికారులను ప్రశ్నించారు. రోడ్డు ఏర్పాటు చేయడానికి మండల పరిధిలోని రాచులూరు, గాజులబుర్జు తండా, అగర్మియాగూడలో 3 సర్వే బృందాలను ఏర్పాటు చేశారు.
అగర్మియాగూడ గ్రా మానికి సర్వే నిర్వహించేందుకు ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ గోపాల్, ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి, సీఐలు సీతారాం, వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది రావడంతో రైతులు మండిపడ్డారు. తమను చర్చలకు రావాలని పిలిచి సర్వే చేస్తారా అంటూ ప్రశ్నించిన అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. తమకు భూమికి, భూమి ఇవ్వాలని పట్టుబట్టారు. ఫోర్త్ సిటీకి వెళ్లేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని, శ్రీశైలం, జాతీయ రహదారి కొత్తూ రు వద్ద జంక్షన్ ఉన్నదని, నాగార్జునసాగర్ జాతీయ రహదారి, తిమ్మాపూరు నుంచి వెళ్లడానికి అనువుగా ఉందన్నారు.
అక్కడి నుంచి రోడ్డు నిర్మిస్తే భూములు పోవని.. తమ భూములు లాక్కోవద్దని వేడుకున్నారు. అయినా అధికారులు సర్వే నిర్వహించారు. దీంతో రైతులు తమకు ఎకరాకు ఎంత పరిహారం అందజేస్తారని చెప్పకుండా సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా వర్తించే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. పచ్చని పొలాలను ఎలా గుంజుకుంటారని నిలదీశారు. ఆర్డీవో అనంతరెడ్డి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని సర్వేకు అడ్డుచెప్పడం సమంజసం కాదని రైతులకు సూచించారు.